I Love Free Software

Portable Windows Freeware - CSV

Giveaway of the Day


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
   SuklAMbaradharaM viShNuM SaSivarNaM caturBujaM
   prasannavadanaM dhyAyEt sarvaviGnOpaSAMtayE


గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
   gururbrahmA gururviShNurgururdEvO mahESvaraH
   guruH sAkShAt paraM brahma tasmai SrIguravE namaH

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః
   vyAsAya viShNu rUpAya vyAsarUpAya viShNavE
   namO vai brahmanidhayE vAsiShThAya namO namaH

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
   kUjaMtaM rAmarAmEti madhuraM madhurAkSharaM
   AruhyakavitA SAKAM vaMdE vAlmIki kOkilam

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవద్పాదం శంకరం లోకశంకరం
   Sruti smRuti purANAnAM AlayaM karuNAlayaM
   namAmi BagavadpAdaM SaMkaraM lOkaSaMkaraM


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ
   vAgarthAviva saMpRuktau vAgarthapratipattayE
   jagataH pitarau vaMdE pArvatIparamESvarau

సూక్తిం  సమగ్రయతు నః స్వయమేవ లక్ష్మీః
శ్రీరంగరాజ మహిషీ మధురైః కటాక్షైః
 వైధగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం
కండూలకర్ణకుహరాః కవయోధయంతి
   sUktiM  samagrayatu naH svayamEva lakShmIH
   SrIraMgarAja mahiShI madhuraiH kaTAkShaiH
     vaidhagdhyavarNaguNaguMBanagauravairyAM
   kaMDUlakarNakuharAH kavayOdhayaMti

హైమోత్ర పుండ్ర మజహంమకుటంసునాసం మందస్మితం మకరకుండల చారుగండం
 బింబాధరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం శ్రి వేంకటేశ ముఖమాత్మనిసన్నిదత్తాం
   haimOtra puMDra majahaMmakuTaMsunAsaM maMdasmitaM makarakuMDala cArugaMDaM
    biMbAdharaM bahuLa dIrGa kRupA kaTAkShaM Sri vEMkaTESa muKamAtmanisannidattAM

విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ
కామాక్షి పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ
   vimalapaTI kamalakuTI pustakarudrAkShaSastahastapuTI
   kAmAkShi pakShmalAkShI kalitavipaMcI viBAsi vairiMcI

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి
   manOjavaM mAruta tulyavEgaM jitEMdriyaM buddhimatAM variShTam
   vAtAtmajaM vAnarayUdha muKyaM SrIrAmadUtaM SirasA namAmi

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం
   ApadAmapahartAraM dAtAraM sarvasaMpadAM
   lOkABirAmaM SrIrAmaM BUyOBUyO namAmyahaM

హరిః ఓం
hariH OM




























 మా కైలాస్ మానస సరోవర ,నేపాల్ ముక్తినాథ్ యాత్ర 

               ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం ఎవరో మానస సరోవర యాత్ర కి పోయి వచ్చి ఆ జలాన్ని మాకు కొంచెం ఇచ్చారు. ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నారో మానస సరోవరం వెళ్ళి వచ్చారను కొన్నాను.
              2008 లో “చార్ ధాం” యాత్ర చేసి వచ్చిన తరువాత  “కైలాస్ మానస సరోవర యాత్ర” చేయాలనే కోరిక బలపడింది. అప్పటి నుండి ఈ యాత్ర ఎలా చెయ్యాలి? ఎవరు తీసుకు వెళ్తారు? అని అందరినీ అడిగే వాడిని. ఉద్యోగం లో వుండ గానే వెళ్తే బాగుండు నని అనుకున్నాను. కానీ భగవదనుగ్రహం కలుగలేదు. 2011 లో ఉద్యోగం నుండి విశ్రమించేను. అయినా రోజు రోజుకి మానస సరోవర్ వెళ్లాలనే సంకల్పం బలపడ సాగింది. ఎవరి ద్వారా వెళితే యాత్ర బాగా ఆధ్యాత్మికంగా జరుగు తుందో తెలుసు కుంటూ ఉండగా మా సింగరేణి కంపనీ లో పని చేసిన ఇంజినీరు శాస్త్రి గారు 2013 లో యెమ్. యెస్. రామారావు ట్రస్ట్   ద్వారా శ్రీ పోలాప్రగడ శ్రీనివాస్ గురూజీ ఆధ్వర్యంలో కైలాస్ మానస సరోవర్,నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేశారని తెలిసి వారిని కలిసి వివరాలు అడిగేను. శ్రీ శ్రీనివాస్ గురూజీ వారి కూడావుండి వారిచే హోమాలు, పూజలు చేయిస్తూ మానస సరోవర యాత్ర ఎంతో ఆధ్యాత్మికంగా, ముక్తి దాయకంగా చేయించారని తెలుసుకొని ఆనందించాను. వారి యాత్ర “వీడియో” కూడా చూపించేరు. చాలా త్రిల్లింగ్ గా అనిపించింది. వెంటనే శ్రీ శ్రీనివాస్ గురూజీకి ఆయనచేతనే ఫోను చేయించేను. అది డిసెంబర్ 2014 లో.
              శ్రీనివాస్ గురూజి ఎంతో చక్కగా ఉత్సాహ పరుస్తూ మాట్లాడి యాత్ర తేదీలు ఫిబ్రవరి, మార్చ్ నెలలలో ఖరారు అవుతాయని, అప్పటినుండి రిజిస్ట్రేషన్ మొదలవు తుందని , తేదీలు ఖరారవగానే తెలియచేస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే ఫిబ్రవరి 2015 లో శ్రీనివాస్ గారు మాకు ఫోను చేసి 2015 లో రెండు సార్లు కైలాస్ మానస సరోవర్, నేపాల్ ముక్తినాథ్ యాత్ర నిర్వహిస్తా మని,మొదటి యాత్ర   21 జూన్ 2015 నుండి 18 రోజులు ఉంటుందని, రెండవ యాత్ర 18 ఆగస్ట్ 2015 నుండి 18 రోజులు ఉంటుందని తెలియ జేసారు.
            చిరకాల వాంఛ తీరుతోందని తొందరగా వెళ్లాలనే తపనతో జూన్ 2015 యాత్రకు సిద్ధమని తెలియ జేసి మా భార్యాభర్తల పేర్లను నమోదు చేయమని కోరుతూ వారి ఇంటికి వెళ్ళి “పాస్ పోర్ట్” జిరాక్స్ కాగితాలను శ్రీనివాస్ గారికి అందజేసి యాత్ర వివరాలను అడిగేము.
             శ్రీ శ్రీనివాస్ గారు, అప్పటికే 9 సార్లు మానస సరోవర యాత్ర నిర్వ్హించానని, ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరుగ లేదని, వారి యాత్రానుభవాలు చెపుతూ వుంటే మేము ఏదో లోకంలోకి వెళ్లిపోయాము.
            అంతలోనే మా అదృష్టమో, దురదృస్టమో నేపాలంతా పలుమార్లు భూకంపంతో అతలా కుతలం అయి పోయింది. (మార్చ్, ఏప్రిల్, మే 2015 మాసాలలో ). మా యాత్ర నేపాల్ మీదుగా జరుగు తుంది. ఒక్క సారి మా మానస సరోవర యాత్ర అనే కల చెదరి పోయినట్లయింది. ఆ మహా శివునికే మొరపెట్టుకున్నాను.
           కం”        పరిశోధన చేయకయా!
                        పరమేశా పాహి! పాహి! పశుపతి నాధా !
                        మరినీ కైలాసగిరికి
                        పరిక్రమను చేయ నిచ్చు బాధ్యత నీదే!                                (7 -5 – 2015)
             అని.  ఖాట్మండు నుండి మానస సరోవర్ కు పోయే దారిలో అక్కడక్కడా భూకంపం వలన రహదారి పాడయిందని ఆ దారిలో ఈ సంవత్సరం యాత్ర జరిగే టట్లు లేదని సమాచారం తెలిసింది. అయినా భగవంతునిపై మా నమ్మకం చెదరలేదు.  మా గురూజీ శ్రీనివాస్ గారు అధైర్య పడవద్దని ఆ భగవంతుడే చూసుకొంటాడని ధైర్యం చెప్పారు. అప్పటికే మా జూన్ యాత్రకి విమానం టిక్కట్లు కొనడం జరిగింది. కానీ శివాజ్ఞ వేరే రకం గా వుంది. జూన్ లో వుండవలసిన మా యాత్రకి చైనా ప్రభుత్వం వీసాలు జారీ చేయలేదు. మా గురూజీ మాత్రం మాకు ధైర్యం చెపుతూ ఆగస్ట్ కి అన్నీ సర్దుకుంటాయని మనం తప్పక యాత్ర చేస్తామని చెప్పి మా విమానం తిక్కట్లు ఆగస్ట్ కి మార్చారు. పరమ శివునిపై నమ్మకం తో అందరం ఆగస్ట్ యాత్రకి సిద్ధం ఆయాము. నేపాల్ భూకంపం భయం తో మాలో కొందరు భయపడి విరమించు కున్నారు. మేము మాత్రం గురూజీ మీద నమ్మకంతో యాత్రకి సిద్ధం ఆయ్యాము.  ఈలోగా మాకు తెలిసిన సమాచారం ఏమిటంటే ఈయేడాది మానస సరోవర్ కి ఖాట్మండు నుండి రోడ్డు ద్వారా యాత్రకి చైనా వీసా జారీచేయడంలేదని,  కొద్ది మందికి  విమానం, హెలికోప్టర్  రూటులో వీసా ఇవ్వవచ్చని  అది కూడా గ్యారంటీ లేదని  తెలిసింది. గురూజీ అందరికీ ఈ విషయం తెలియజేసి ఆ రూటు లో ఖర్చు ఎక్కువ అవుతుందని ఇస్ట మయిన వారికి వీసా ప్రయత్నం చేస్తానని చెప్పారు. మొత్తం 32 మంది సిద్ధం అయ్యాము. గురూజీ భగవంతునిమీద భారం వేసి ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఆగస్ట్ 18 న మా ప్రయాణం మొదలవాలి. ఆగస్ట్ 15 వరకు వీసా సమాచారం తెలియలేదు. ఆరోజు గురూజీ ఇంట్లో అందరినీ సమావేశ పరచారు. వీసా వచ్చే అవకాశం ఉందని తెలిసిందని, మెసేజ్ వచ్చేవరకు నమ్మలేమని, భగవంతుడే చూసుకుంటాడని , ఆగస్ట్ 16 లోగా వీసా మెసేజ్ రాకపోతే ఈ సంవత్సరం ఇక యాత్ర లేనట్టేనని చెపితే బాధ అనిపించింది. 16న మెసేజ్ రాక పోతే 17 న టికెట్ కాన్సెల్ చేసుకోమని చెప్పారు. భగవంతునిపై భారం వేసి  అందరం భారంగా ఇంటికి చేరు కొన్నాము. ఇంటికి చేరిన గంటలో గురూజీ వీసా వచ్చినట్టు మెసేజ్ వచ్చిందని ఫోన్  లో చెప్పి, అందరినీ యాత్రకి కావలిసినవి సర్దుకోమని (లిస్ట్ ముందే ఇచ్చారు)చెప్పారు.
             మా ఆనందానికి అవధులు లేవు. పరమేశ్వరునిపై మా నమ్మకం వమ్ము  కాలేదు. ఈ ఏడాది విమానాలు, హెలికోప్టర్ రూటులో కొద్ది మందికి మాత్రమే వీసా ఇచ్చారని  ( 4 –5 వందల మందికి మాత్రమే) తెలిసింది. అందులో మేముండడం మా అదృష్టం, పరమేశ్వరుని అనుగ్రహం.
             వెంటనే చలికి యాత్రలో తట్టుకునే లోపలి ఉన్ని దుస్తులు వగైరా కొనుక్కొని, గురూజీ ట్రస్ట్ తరఫున ఇచ్చిన బ్యాగులలోఅన్నీ సర్దుకుని యాత్రకి సిద్ధం అయ్యాము. గురూజీ అందర్నీ 18 ఉదయం 4 గం. లకు హైదారాబాద్ విమానాశ్రయం లో వుండాలని చెప్పారు.
యాత్ర మొదటి రోజు: 18 – 08 - 2015.
             గురూజీ చెప్పినట్లుగానే అందరం 18 ఉదయం 4 గం. లకు విమానాశ్రయం చేరుకుని లగేజ్ ఇచ్చి బోర్డింగ్ పాస్ తీసుకుని ఎయిర్ఇండియా విమానం ఎక్కాము. సరిగ్గా 6.50 ని.లకు మా విమానం బయలుదేరింది.అందరమూ భగవంతుడిని తలుచుకొని బయలు దేరాము. 8.50 ని.లకు. ఢిల్లీ విమానాశ్రయం చేరాము. గురూజీ ఆ విమానాశ్రయంలోనే ఒక హోటల్ లో అందరికీ ఫలహారాలు పెట్టించి మా గ్రూపులో అందరినీ ఒకరికి ఒకరిని పరిచయం చేశారు.
             ఢిల్లీ నుండి మా ఖాట్మండు విమానం 2 గం. లకు బయలుదేరి 3.15 కి చేరింది. మా దురదృస్టమో ఏమో కొందరి లగేజ్ ప్రతికూల వాతావరణం దృస్ట్యా డిల్లీ విమానాశ్రయం లో నిలిపివేశారని తెలిసింది. అందులో మా లగేజ్ కూడా రాలేదు. కట్టు బట్టలతో ఉన్నాము. మాతో వచ్చిన ఇంకొక సింగరేణి ఇంజనీరు కృష్ణ మూర్తి గారి లగేజ్ వచ్చింది. అక్కడే ఖాట్మండు విమానాశ్రయం లో లగేజ్ రాలేదని ఫిర్యాదు చేసి మా హోటల్ కి చేరుకున్నాము. మరునాడు ఉదయం విమానం లో మా లగేజ్ వస్తుందని చెప్పారు.వచ్చేవరకు నమ్మకం లేదని కొందరు అన్నారు.  ఆడుగ డుగునా భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు. ఆ రాత్రికి కట్టుబట్టలతో అలాగే హోటల్ లో పడుకున్నాము.
యాత్ర 2వ రోజు: 19 – 08 – 2015.
              ఉదయమే లేచి, కాఫీ త్రాగి మా స్నేహితుడు కృష్ణ మూర్తి గారు ఇచ్చిన పట్టు బట్టలు కట్టుకొని సిద్ధం అవగానే  గురూజీ అందర్నీ పశుపతినాథ్ ఆలయానికి తీసుకెళ్లి స్వామి దర్శనం అనంతరం మాచే రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం చేయించి మానస సరోవర్ యాత్ర జయప్రదంగా జరగాలని రక్షకట్టించి సిద్ధం చేశారు. గుడినుండి హోటల్ కి వచ్చి అల్పాహారం తీసుకొని “బుడే నీలకంఠ్” (పవళించి యున్న శ్రీమన్నారాయణుడు)   గుడికి తీసుకెళ్లారు ఖాట్మండులో. స్వామి దర్శనం చేసుకోగానే స్వామికి మాపై అపారమైన కృప కలిగింది. మా మిస్ అయిన లగేజ్ వచ్చిందని , వెంటనే హోటల్ కి  వచ్చి లగేజ్  సరి చూసుకోమని గురూజీ నుండి ఫోన్ వచ్చింది. ఇదే భగవంతునిపై మనకున్న నమ్మకానికి నిదర్శనం.
            వెంటనే హోటల్ కి వెళ్ళి మా లగేజ్ సరి చూసుకొని మా మానస సరోవర యాత్ర కి కావలసిన సామగ్రిని ఒక బ్యాగ్ లో సర్దుకొని మిగతా లగేజ్ ని మా నేపాల్ ముక్తినాథ్ యాత్రకి ఆ హోటల్ లోనే విడిచిపెట్టి లంచ్ తీసుకొని మా యాత్ర కొనసాగించడానికి ఖాట్మండు విమానాశ్రయానికి తరలి వెళ్లాము. అక్కడనుండి “యెతీ ఎయిర్ వేస్” వారి చిన్న (26 సీట్ల) విమానం లో 3 గం.లకు బయలు దేరి 4గం. లకు నేపాల్ గంజ్ చేరుకున్నాము. ఈ నగరం ఉత్తర్ ప్రదేశ్ బోర్డర్ లో   వుంటుంది. నేపాల్ గంజ్ లో ఆరాత్రి “సిద్ధార్థ”అనే హోటల్ లో బస చేశాము. హోటల్ చాలా బాగుంది. స్నానాలు చేసి ఆ వూరిలో వున్న “భాగేశ్వరిమాత” గుడికి వెళ్లాము. అమ్మ వారి 51 శక్తి పీఠాలలో అది ఒకటని, అక్కడ అమ్మ వారి తెగిన నాలిక పడిందని చెప్పారు. ఆ గుడిలో భజన చాలాబాగా చేశారు. దర్శనం బాగా జరిగింది. ఆ రాత్రి భోజనం అవగానే గురూజీ అందరినీ సమావేశ పరచి యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి , యాత్రలో చలికి తట్టుకోడానికి దళసరి “డౌన్ జాకెట్” లు , అల్ల్యుమినియమ్ నీళ్ళ సీసాలు (వేడి నీలు పెట్టుకోడానికి )ఇచ్చారు. మరునాడు వెళ్లబోయే స్థలం గురించి తెలియ జేసారు.


యాత్ర 3వ రోజు: 20 – 08 – 2015.
            ఉదయం 4.30 ని. లకు అందరం లేచి స్నానాలు చేసి గురూజీ చేయించే రుద్రాభిషేకం లో పాల్గొన్నాము. చాలాఆ నందంగా అనిపించింది. 5గం. లకు అల్పాహారం ముగించి, నేపాల్ గంజ్  విమానాశ్రయానికి బయలు దేరాము. లగేజ్ చెకింగ్ అవగానే 14 సీట్ల
చిన్న “తారా  ఎయిర్ వేస్ “ విమానం లో 9.25ని.లకు బయలుదేరి 10.15 ని.లకు “సిమికోట్” అనే హిమాలయ పర్వత ప్రాంతం లో దిగేము. అది సముద్ర మట్టానికి 3,100 మీ. ఎత్తులో ఉంది. చుట్టూ ఐస్ పర్వతాలతో వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదంగా ఉంది .ఆ రాత్రికి అక్కడే ఒక హోటల్ లో బస చేశాము.
           కైలాస్, మానస సరోవర్ యాత్ర చెయ్యాలంటే హిమాలయాల్లో 22,000 అడుగుల పైకి ఎక్కాలి. అక్కడ ప్రాణవాయువు చాలా తక్కువుగా వుంటుంది. అక్కడి వాతావరణానికి మన శరీరం అలవాటు పడాలంటే, మధ్యలో ఆగుతూ వెళ్ళాలి. లేకపోతే, ప్రాణాపాయం జరిగే అవకాశం వుంటుంది. ఆ వాతావరణానికి (హై altitude) అలవాటు పడడానికి dimox అనే మాత్రలు కూడా అక్కడ వున్నన్ని  రోజులు వేసుకోవాలి.
           గురూజీ ఆ సాయంత్రం అందరితో సమావేశం ఏర్పాటు చేసి “రుద్రం” చదివి అర్ధం వివరించారు. భోజనాలు అయ్యాక అందరికీ dimox మాత్రలు ఇచ్చి యాత్ర పూర్తయి నేపాల్ వెళ్ళేవరకు రోజు వేసుకోవాలని చెప్పారు. ఆ హిమాలయాల మధ్యన అందమయిన ప్రకృతి ఒడిలో అతి చల్లని వాతావరణంలో ఏదో తెలియని ఆతృత తో ఆరోజు అక్కడ పడుకున్నాము.
యాత్ర 4వ రోజు: 21 – 08 – 2015.
           ఆరోజు “శ్రావణ శుక్రవారం”. మా గ్రూపు 32 మందిలో 21 మంది స్త్రీలే.  ఉదయం 5 గం. లకు లేపి స్త్రీ లందరితో “వరలక్ష్మి” వ్రతం చేయించారు. తరువాత అందరం అల్పాహారం తీసుకొని 7 గం. ల నుండి 6 ట్రిప్పులలో హెలికోప్టర్ లో “హిల్సా” అనే ప్రాంతానికి వెళ్లాము. హిల్సా చైనా బోర్డర్ లో ఉన్ననేపాల్ గ్రామం.  హెలికోప్టర్ లో ఒకసారి 5 గురు వారి లగేజ్ వెళ్లవచ్చు. అందరం హిల్సా చేరే సరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది. అక్కడ అందరం భోజనం చేసి మధ్యాహ్నం 3 గం. లకు చైనా లో ప్రవేశించాము. అక్కడ నుండి మా బస్ ప్రయాణం మొదలయింది. 1  కి.మీ. వెళ్ళగానే చైనా చెక్ పోస్ట్ వచ్చింది. అక్కడ మా వీసా, పాస్ పోర్ట్ లగేజ్ చెక్ చేసి, చైనా ఆక్రమించిన టిబెట్ (మానస సరోవర్, కైలాస్ పర్వతాలు ఇక్కడే వున్నాయి.) లోకి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు.  అక్కడ నుండి ఒక గంటలో “పురాంగ్”, అనే పట్టణం చేరుకున్నాము. అక్కడ కస్టమ్స్ వారు మళ్ళీ మా లగేజ్, వీసాలు చెక్ చేసారు. పురాంగ్ సముద్ర మట్టానికి 3,500 మీ. ఎత్తులో  హిమాలయాల మధ్య వుంటుంది. ఆరాత్రికి మా బస హోటల్లో అక్కడే. అక్కడ నుండి గురూజీ తీసుకు వచ్చిన నేపాలు  వంట  వారి భోజనం. భోజనాలు చేసి రాత్రి అతి చల్లని వాతావరణం లో అక్కడ హోటల్ లో పడుకున్నాము.
యాత్ర 5 వ రోజు: 22 – 08 – 2015.
             ఉదయం 6 గం. లకు అందరం సమావేశ మయి గురుజీ చేసే రుద్రాభిషేకం లో పాల్గొన్నాము. తరువాత ఫలహారాలు చేసి పురాంగ్ లో కాసేపు తిరిగేము. అక్కడే గురూజీ మానస సరోవర్ ఒడ్డున చేయబోయే “హోమాల”కి కావలసిన నెయ్యి వగయిరా సామగ్రి అంతా తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గం. లకు భోజనం చేసి “మానస సరోవరం” దగ్గరికి బయలు దేరాము. దారిలో రావణాసురుడు తపస్సు చేసిన “రాక్షస తాల్” అనే పెద్ద సరస్సుని చూసుకుంటూ సాయంత్రం 4 గం. లకు మానస సరోవర్ ఒడ్డుకు చేరుకున్నాము. మానస సరోవర్ చూడగానే ఒళ్ళు జలదరించింది. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం కదా అనిపించింది. మానస సరోవర్ ఒడ్డునే మా బస. చాలా పెద్ద ఆవరణలో వరుసగా గదులున్నాయి.  చలికి తట్టుకొనే పరుపులతో. మానస సరోవరం సముద్ర మట్టానికి 4,200 మీ. ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తులో ఉన్న సరోవరం ప్రపంచం లో అదే. విభీషణుని భార్య “సురమ” ఈ సరస్సు ఒడ్డునే జన్మించినట్లు వాల్మీకి రామాయణం లో ఉంది.  ఆ సరోవరానికి దగ్గరలోనే మహా శివుని పవిత్ర “కైలాస” శిఖరం దర్శనం అయింది. తన్మయులమయి చూసి ఆనందంతోగెంతులేసాము. ప్రాణవాయువు అక్కడ చాలా తక్కువ వుంటుందనేది అక్కడ కొంచెం  మొదలయింది. కొద్ది దూరం నడుస్తే కొంచెం  ఆయాసం అనిపించింది. ఆరాత్రికి అక్కడే మా నేపాలీ వంటవారు చేసిన భోజనం చేసి విశ్రమించాము. ఆ వాతావరణం లో త్రాగ డానికి వీలుగా మా వంట వాళ్ళు ఎప్పటి కప్పుడు వేడి నీళ్ళు అందించేవారు.  ఆ రాత్రి 12 గం. లకు  మేల్కొని మానస సరోవరం లో జ్యోతి రూపం లో దేవతలు వచ్చి స్నానం చేసి వెళతారనదానికి నిదర్శనం గా మాకు ఆ సరస్సు లో 6 -7 జ్యోతి రూపాలు కనిపించేయి. కొంత సేపటికి కొన్ని మాయం అయ్యాయి.  అవి చూసి మా జన్మధన్యమయింది అనుకున్నాము.
యాత్ర 6 వ రోజు: 23 – 08 – 2015.
            ఉదయమే మా అందరినీ లేపుతూ మా నేపాల్ వంట వాళ్ళు కాఫీ, టీ, ఫలహారాలు అందించారు. గురూజీ వెంట వచ్చిన  పురోహితుడు శ్రీ గురురాజ ఉదయం 9 గం. లకు మా అందరి గోత్ర నామాలు వ్రాసుకుని మా అందరిచేతా సంకల్పం చెప్పించారు. తరువాత అందరం మానస సరోవరం లో స్నానాలు చేశాము. మా పాపాలన్నీ పాటా పంచలయ్యాయని అనిపించింది. కలలో కూడా ఊహించ లేని మధురాతి మధుర మయినది ఆ క్షణం. ఆ ఆనందం మాటల్లో వర్ణించ లేనిది. స్నానాలు అయ్యేక మా పురోహితుడు చనిపోయిన చుట్టాలకు, మిత్రులకు తిల తర్పణాలు ఇప్పించారు. మా తల్లి తండ్రులు, బంధువులు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా!
           ఆ తరువాత మా చేత నూతన ఉపవీత ధారణ చేయించారు. మానస సరోవరం ఒడ్డున “సంధ్యావందనం”చేసు కోవాలనే నా  కోరిక ఆరోజు నెరవేరింది. తరువాత మా అందరి చేత  మానస సరోవరం ఒడ్డున మా గురూజీ ఆద్వర్యం లో మా పురోహితుడు “సర్వ దేవతా హోమం,నక్ష త్ర హోమం చేయించారు.  కైలాస పర్వతానికి అభిముఖంగా కూచుని  365 వత్తుల తో నెయ్యి దీపం వెలిగించి స్వామికి నివేదన చేశాము.పరమ శివుడుండే కైలాస గిరికి  అభిముఖంగా దీపం వెలిగించే అదృష్టాన్ని తలచుకొని పొంగి పోయాము. మధ్యాహ్నం 2 గం. లకు హోమాదులు ముగించుకొని భోజనం చేసి విశ్రమించాము. ఆ సాయంత్రం మా పురోహితుడు మా బస లోనే ఆ సరోవరం ఒడ్డున అన్నవరం నుండి తెప్పించిన స్వామి డాలరు, పసుపు బట్ట ఇచ్చి మా అందరిచేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు .ఎంత పుణ్యమో కదా!
            భోజనం చేసి ఆ రాత్రికి (రెండో రాత్రి) మానస సరోవర్ ఒడ్డునే విశ్రమించాము.
యాత్ర 7 వ రోజు: 24 – 08 – 2015.
           ఉదయమే లేచి మేము  తిరిగి మానస సరోవరం లో స్నానం చేసాము. రెండో రోజు కూడా అక్కడ సంధ్యావందనం చేసుకొనే భాగ్యం భగవంతుడు కల్పించాడు. ఆ తరువాత అందరం అల్పాహారం తీసుకుని కైలాసగిరి పరిక్రమకు “బేస్ కాంప్ “ అయిన “డార్చెన్” అనే వూరికి బయలు దేరి 12 గం. లకు చేరాము. భోజనం చేసి అక్కడే పరిక్రమ చేసే  వాతావరణానికి మన శరీరం adjust అవడానికి వీలుగా విశ్ర మించాము. స్వామి వారి కైలాస గిరికి అతి దగ్గర ప్రాంతం డార్చెన్. అక్కడ నుండి స్వామి వారి కైలాస గిరి ఎంతో ఉన్నతం గా కనిపించింది. స్వామి వారికి నమస్కరించుకొని ఆనంద పరవసుల మయ్యాము.
యాత్ర 8 వ రోజు: 25 – 08 – 2015.
            ఉదయం 6 గం. లకు అందరం స్నానాలు ముగించుకొని గురూజీ తో రుద్రాబిషేక పూజలు చేసుకొని  అల్పాహారం తీసుకుని మొదటి రోజు పరిక్రమకు బయలు దేరాము. అరగంట బస్ లో ప్రయాణం చేసిన తరువాత “యమద్వారం” దగ్గరకు చేరుకున్నాము.
 అక్కడ నుండే పరిక్రమ ప్రారంభం. నడిచే వాళ్ళు నడిచి , నడవలేని వాళ్ళు గుర్రాలమీద బయలు దేరారు. అక్కడ నుండి మొదటి రోజు రాత్రి బస చేరే స్థలానికి 18 కి.మీ. మా గ్రూపులో 4 గురు పెద్దవారు పరిక్రమకు రాలేదు. డార్చెన్ లో ఉండిపోయారు. మా గ్రూపులో గురూజీ, ఆయన తమ్ముడు చంద్ర శేఖర్, పురోహోతుడు, 6 గురు రాజుల అమ్మాయిలు, నేను నడుస్తూ బయలు దేరాము. మిగతా వాళ్ళు గుర్రాలపై బయలు దేరారు. పరిక్రమకు బయలు దేరిన వారిలో వయసులో పెద్దవాడిని నేనే. 34 ఏళ్ల గా శబరిమల నడిచిన నా నడక అనుభవం తో నడవగలననే ధైర్యం తో నడక మొదలు పెట్టాను. కొంత దూరం బాగానే నడిచాను. ప్రాణవాయువు చాలా తక్కువ వుండటం తో నా వయసు, శరీరం సహకరించ లేదు. చాలా ఆయాస పడవలసి వచ్చింది. నడకలో అందరి కంటే వెనుక పడ్డాను. ఇద్దరు రాజుల అమ్మాయిలు,పద్మ గారు, రాణిశ్రీ గారు, గురూజీ నాకూడా వుండి కబుర్లు చెపుతూ మొత్తానికి మొదటి రోజు 18 కి.మీ. దూరం  మా రాత్రి బస దగ్గరికి నడిచేటట్లు చేశారు.
          అక్కడ కైలాస గిరి వెనుక భాగం కనిపిస్తుంది. సాయంత్రం 6 గం. లకు అందరం అక్కడ భజనలు చేసి స్వామికి నైవేజ్యం పెట్టి హారతి ఇచ్చాము. మా జన్మ సార్ధకత లభించింది అనిపించింది. ఆ రాత్రి గురూజీ భోజనాలు అయ్యేక “ డాక్టర్ గారూ! రెండో రోజు ఇంకో 2000 అడుగులు పైగా “డోల్మా పాస్” వరకు ఎక్క వలసి వుంటుంది. మీరు ఈరోజు నడకలో పడ్డ ఇబ్బంది గమనించాను. రేపు గుర్రం మీద వెళ్తే మంచిద”ని  సలహా ఇచ్చారు. అనుభవంతో గురూజీ ఇచ్చిన సలహా స్వీకరించి రెండోరోజు “డోల్మా పాస్” వరకు గుర్రం మీద వెళ్లడానికి నిశ్చయించేను. రాత్రి చాలా చలి గా వుంది. ఎవరూ  సరిగ్గా నిద్ర పోలేదు. ఆ రాత్రి  – 5 డిగ్రీలు ఉందిట . 2 అడుగులు నడచినా ఆయాసం వచ్చింది. ప్రాణవాయువు చాలా తక్కువగా వుంది. గురూజీ అనుభవం తో ఇచ్చిన సలహా సరియైన దనిపించింది.
యాత్ర 9 వ రోజు: 26 – 08 – 2015.
         అందరం ఉదయం 6 గం. లకు లేచి కాల కృత్యాలు తీర్చుకుని, అల్పాహారం, కాఫీ తీసుకుని రెండో రోజు పరిక్రమ ఆరంభించేము. ఇంచుమించు 3 – 4 గంటల తర్వాత ఎత్తైన ప్రదేశ మైన “డోల్మా పాస్”  (22,000 అడుగులు) చేరు కున్నాము.
ఆ దారిలో “గౌరికుండ్” కనిపిస్తుంది. అక్కడ నుండి 3000 అడుగులు ఏటవాలుగా క్రిందికి దిగాలి. గుర్రాలు మనుషులతో దిగితే పడిపోతాయి. అందుచే అక్కడ నుండి ఎవరైనా 6 – 7 కి.మీ. ఏటవాలుగా దిగవాల్సిందే.  మధ్యలో ఒక ఫర్లాంగు దూరం ఐస్ లో నడ వాలి. ఏమాత్రం ఏకాగ్రత తప్పినా జారీ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందరం జాగ్రత్తగా ఒకరికి ఒకరు సహకరించు కుంటూ 12 గంటల ప్రాంతానికి plain ఏరియా కి దిగగలిగేము. అక్కడ చిన్న హోటల్ లో టీ త్రాగి  కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని అక్కడనుండి 12 కి.మీ. నడిచి/గుర్రాల మీద రెండవరోజు రాత్రి బస చేసే చిన్న ఊరికి చేరాము. మా నేపాలీ వంటవారి భోజనం రాత్రికి చేసి అక్కడ విశ్ర మించేము.అక్కడకూడా చాలా చలిగా ఉంది.  రెండవ రోజు పరిక్రమ 22 కి.మీలు.
          కొంతమంది విదేశీయులు “I believe in lord  Siva” అంటూ గౌరికుండ్ లో అంతా చలిలో స్నానం చేసి పూజలు చేశారుట.  అదీ నమ్మకం అంటే. వాళ్ళు నిజమైన భక్తులు.
యాత్ర 10 వ రోజు: 27 – 08 -2015.
             ఉదయమే లేచి, కాల కృత్యాలు తీర్చుకుని కాఫీ/టీ ,అల్పాహారం తీసుకుని తిరిగి మేము బయలుదేరిన చోటుకి అంటే డార్చెన్ కి (12 కి.మీ.) బయలుదేరాము. మూడవ రోజు పరిక్రమ పూర్తి చేసుకుని ఇంచుమించు ఉదయం 11గం.లకు అందరం పరిక్రమ ఆఖరు ఘట్టానికి చేరుకున్నాము. గురూజీ కి నమస్కరించి, ఆనందంతో కేరింతలతో గంతులు వేస్తూ ఒకరిని ఒకరు అభినందించుకున్నాము.
            ఇదంతా ఆ పరమేశ్వరుని కృప, మా గురూజీ శ్రీనివాస్ గారి సంకల్పం, చక్కని ప్రణాళిక వలన ఎంతో అద్భుతంగా జరిగింది. మా ఆనందానికి అవధులు లేవు. డార్చెన్ చేరి అందరం వేడి నీళ్ళ స్నానాలు చేసి, భోజనం చేసి, అక్కడ నుండి తిరిగి మానస సరోవరం వెనుక భాగానికి 4 గం. లకు చేరుకున్నాము. ఆ రోజు అక్కడ మట్టి గదులలో (mud houses) విశ్రమించేము. సాయంత్రం అందరూ అక్కడ మానస సరోవరంలో స్నానాలు చేసి, ఇంటికి పట్టుకెళ్లడానికి నీళ్ళు అక్కడే పట్టుకొన్నాము.
యాత్ర 11వ రోజు: 28 – 08 -2015.
           ఉదయమే అందరం లేచి గురూజీ తో రుద్రాభిషేకం, సుదర్శన హోమం లో పాల్గొన్నాము. అనంతరం కాఫీ, అల్పాహారం సేవించి తిరుగు ప్రయాణం మొదలెట్టాము. దారిలో పురాంగ్ లో కస్టమ్స్ చెక్  అయిన తర్వాత అక్కడే భోజనం చేసి సాయంత్రం 3 గం. లకు చైనా దాటి హిల్సా చేరాము. అక్కడ నుండి మేము సిమికోట్ చేరాలి. కానీ చీకటి పడడం వలన హెలికాప్టర్ లో సగం మంది మాత్రమే ఆరోజు సిమికోట్ చేర గలిగేరు. మిగతా సగం మంది ఆ రాత్రికి హిల్సా లోనే ఒక హోటల్ లో బస చేశాము. అక్కడే సాయంత్రం లలిత, విష్ణు సహస్ర నామ పారాయణాలు చేసుకుని విశ్రమించేము.
యాత్ర 12 వ రోజు: 29 – 08 – 2015.
             ఉదయం అందరం 6 గం. లకు సిద్ధం అయి హెలికాప్టర్ లో 3  ట్రిప్పులలో  సిమికోట్ చేరుకున్నాము. అక్కడ నుండి అందరం “గోమాఎయిర్  వేస్” చిన్న విమానంలో (14 సీటర్) 2 దఫాలుగా నేపాల్ గంజ్ చేరి 1 గంటకు సిద్ధార్థ్ హోటల్ లో  విశ్రమించేము. ఆ రోజంతా మా మానస సరోవర్ యాత్రను తలచుకుంటూ గడిపేము.
యాత్ర 13 వ రోజు: 30 – 08 – 2015.
              ఆ రోజు నేపాల్  గంజ్ లో రెస్ట్ తీసుకొని సాయంత్రం 4 గం లకు “బుద్ధా ఎయిర్ వేస్” విమానం లో అందరం ఖాట్మండు చేరుకుని “సంగ్రీలా” 5 నక్షత్రాల హోటల్ కి 6 గం. లకు చేరుకుని విశ్రమించేము. ఇక్కడితో మాకైలాస్  మానస సరోవర యాత్ర ముగిసి, నేపాళ్ ముక్తి నాథ్ యాత్ర మొదలయింది. నేపాల్ ముక్తినాథ్ యాత్రకి 26 మంది సిద్ధం అయి, మిగతావారు హైదరాబాద్ వెళ్ళి పోయారు.


యాత్ర 14 వ రోజు: 31 – 08 – 2015.
               హోటల్ సంగ్రీలా లో ఉదయం అల్పాహారం ముగించి 8 గం. లకు నేపాల్ లో “మనోకామన” అమ్మ వారి గుడికి ఏ. సి. బస్ లో బయలు దేరాము.   మధ్యాహ్నం 12.30 ని.లకు అమ్మవారి కొండ దగ్గరకు చేరి అక్కడ భోజనం చేసి “రోప్ వే” (5 కి.మీ.)లో కొండ పైకి వెళ్ళి అమ్మ వారి దర్శనం చేసుకున్నాము. భూకంపం వలన ఆ గుడి కూలిపోతే ,పక్కనే అమ్మ వారి విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు. అక్కడ పూజలు చేయించుకుని 3.30ని.లకు క్రిందకు దిగి ముక్తినాథ్ యాత్రకు “పోక్రా”అనే వూరికి బయలుదేరాము. పోక్రా కెళ్లే త్రోవలో బాగా వర్షం పడింది. ముక్తినాథ్ యాత్ర వాతావరణం సహకరిస్తేనే ఉంటుంది. వర్షం రావడంతో భయం వేసింది. వాతావరణం బాగు లేక పోతే కొన్ని రోజులపాటు  ముక్తినాథ్ యాత్రకు వీలవదని విని ఆందోళన చెందేము. కానీ మా గురూజీ మాత్రం తెల్ల వారేసరికి అంతా సర్దుకుంటుందని ఆందోళన పడవద్దని ధైర్యం చెప్పారు. అందరం 7.30 ని.లకు పోక్రా చేరి అక్కడ “పెనింసులా” అనే హోటల్ లో బస చేశాము. గురూజీ అన్నట్లే తెల్లవారేసరికి వర్షం తగ్గిపోయింది.
యాత్ర 15 వ రోజు: 01 -09 – 2015.
            అందరం ఉదయం 6 గం. లకు కాఫీ  తీసుకుని పోక్రా విమానాశ్రయాని కి చేరాము. పోక్రా నుండి  “జాంసం”  అనే వూరు విమానం లో చేరి అక్కడ నుండి చిన్న బస్ లో 35 కి.మీ. వెళ్తే ముక్తినాథ్ వస్తుంది. పోక్రా నుండి జాంసమ్ వాతావరణం క్షణాలలో మారిపోతూ వుంటుంది. విపరీతమైన గాలి వచ్చి విమానాలు వెళ్లలేవు. 7 గం. లకు.వాతావరణం బాగుందని మాకు “సెక్యూరిటి” చెక్ చేసి లోపలికి పంపేరు. 15 ని.లలో వాతావరణం బాగు లేదని మళ్ళీ బయటకు పంపేరు. ముక్తినాధుని దర్శన భాగ్యం లేదనుకున్నాము. మళ్ళీ 8గం.లకు వాతావరణం బాగుందని కబురొచ్చింది. వెంటనే అక్కడ మా కోసం రెడీ గా వున్న “సింరిక్ ఎయిర్ వేస్”  చిన్న విమానం (14 సీటర్) ఎక్కి 20 నిముషాలలో జాంసమ్ విమానాశ్రయం చేరాము. రెండో ట్రిప్ లో మా గ్రూపులో మిగిలిన వాళ్ళని తీసుకొచ్చింది . జాంసం లో “మెజెస్టిక్ గెస్ట్ హౌస్” లో దిగి కాఫి, టిఫిన్ తీసుకుని చిన్న వాన్ లో ముక్తినాథ్ కి బయలు దేరాము. “గండకి’ నది ఒడ్డున 35 కి.మీ. ప్రయాణం చేసి ముక్తినాథ్ చేరాము. దగ్గరలో (3 కి.మీ.) చిన్న గుట్ట పైన ముక్తినాథ్ ఆలయానికి  నడిచి చేరుకొనే సరికి మధ్యాహ్నం 12 గం.లు అయింది.
            అక్కడ 108 ధారలు , ఆ వాతావరణం చూసి పులకరించి పోయాము. 108 ధారలు కాకుండా అక్కడ కర్మ ధార, ముక్తి ధా ర వున్నాయి. ముందుగా 108 ధారలలో స్నానం చేసి తరువాత కర్మ ధార ,ముక్తిధారలలో స్నానం చెయ్యాలి.  మేము ఆరకంగా 3 సార్లు స్నానం చేశాము. నెత్తి మీద నీళ్ళ ధారలు పడుతూ వుంటే, తల గడ్డ కట్టినట్టు అయి పోయేది. నీళ్ళు అంతా చల్లగా వున్నాయి. మా కుటుంబ సభ్యులందరి పేర్లు గోత్ర నామాలతో వ్రాసిన తెల్ల బట్ట నెత్తి మీద పెట్టుకుని ఆ పవిత్ర స్నానం చేశాము. (అలా చేస్తే కుటుంబ సభ్యులందరికి పుణ్యం వస్తుందని మా స్నేహితుడు చెప్పారు).  ఆ తరువాత అందరం బట్టలు మార్చుకుని శ్రీ ముక్తినాధుని దర్శనం చేసుకున్నాము. జీవితం లో ఎప్పుడైనా ఇటువంటి భాగ్యం కలుగు తుందా అనే భావం వుండేది. అటువంటి భాగ్యం ఆరోజు మాకు లభించింది. మా అదృష్టం ,మాకు ఒక్క రోజులో స్వామి దర్శన భాగ్యం లభించింది. చాలా మంది వారం రోజులు వేచిఉన్నా ప్రతికూల వాతావరణం వలన దర్శనం లభించదట. మాపై ముక్తినాధునికి అపారమైన అనుగ్రహం ఉంది.
              తృప్తిగా దర్శనం చేసుకుని ముక్తినాథ్ వూరిలో కమ్మని భోజనం చేసి కొన్ని  “సాలిగ్రామాలు” కొనుక్కొని సాయంత్రం 6 గం.లకు తిరిగి జాంసం చేరుకొని గెస్ట్ హౌస్ లో విశ్రమించేము. ముక్తినాథ్ “అన్నపూర్ణ” రేంజ్ హిమాలయ శ్రేణులలో ఉంది.
యాత్ర 16 వ రోజు:  02 – 09 – 2015.
             ప్రొద్దున్నే 6 గం. లకు లేచి 200 గజాల దూరం లో ఉన్న జాంసమ్ విమానాశ్రయానికి చేరుకున్నాము. వాతావరణం సహక రించడం వలన 2 దఫాలుగా మేమందరం తిరిగి  9 గం.లకు పోక్రా చేరుకున్నాము. జీవితం  లో మా ముక్తినాథ్ యాత్ర మరచి పోలేని ఒక మధురానుభూతి. పోక్రా లో కాఫీ, ఫలహారం తీసుకొని , అక్కడ వున్న  గుప్తెశ్వర్ మహాదేవ్, వింధ్య వాసిని అమ్మవారు, సరస్సు మధ్యన ఉన్న వారాహి అమ్మవారు దేవాలయాలకు వెళ్ళాము. మధ్యాహ్నం 1.30 ని.లకు తిరిగి వచ్చి భోజనం చేసి ఆరోజుకు అక్కడే విశ్ర మించాము. పోక్రా ఒక టూరిస్ట్ సెంటరు. చాలామంది విదేశీయులు వచ్చి అక్కడ “గ్లైడింగ్ , ట్రెక్కింగ్” చేస్తూ వుంటారు.
యాత్ర 17 వ రోజు: 03 -09- -2015.
              ఉదయం కాఫీ, ఫలహారం తీసుకుని 12  గం.లకు పోక్రా విమానాశ్రయం నుండి బయలుదేరి “బుద్ధా ఎయిర్ వేస్” లో  ఖాట్మండు 2 గం.లకు చేరి భోజనం చేసి “సంగ్రీల”హోటల్ నుండి “గోకర్ణ ఫారెస్ట్ రిసార్ట్” కి మారిపోయాము. అది అడవిలో “లేళ్ళ” మధ్యన ప్రకృతి వొడిలో అందమయిన వాతావరణం లో వుంది. సాయంత్రం 6 గం. లకు అందరం పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం , హారతి దగ్గరనుండి చూసి ఆనంద పరవసులమైనాము.రాత్రికి గెస్ట్ హౌస్ లో విశ్రమించేము.
యాత్ర18 వ రోజు: 04 – 09 – 2015.
              ఉదయమే లేచి స్నానాదులు ముగించుకుని ఖాట్మండులో ఉన్న దక్షిణ కాళి ఆలయం, స్వయంభూనాథ్ భౌధ్ధ ఆరామం, చూసి, భోజనం చేసి, 3 గం..లకు బుద్ధ ఎయిర్ వేస్ విమానం లో “జనక్ పూర్” (మిధిలా నగరం) 4.30 ని.లకు చేరాము. నేపాల్ లో రాజకీయ కారణాల వలన అక్కడ “ధర్నాలు” జరుగుతున్నాయి. రిక్షాలలో మేముండవలసిన “సీతా శరణ్” హోటల్ చేరుకుని స్నానాదులు ముగించి, “జానకి మహల్,  గంగా హారతి” చూసి మా హోటల్ కి వచ్చి విశ్రమించేము.
యాత్ర 19 వ రోజు: 05 – 09 - 2015.
              ఉదయమే స్నానం, ఫలహారం చేసి మళ్ళీ జానకి మహల్ కి వెళ్ళి హారతి చూసి, సీతారాముల కళ్యాణం జరిగిన స్థలం చూసి, రామ మందిర్, సంకట మోచన్ హనుమాన్ ఆలయాలు దర్శించుకుని 10.30 ని.లకు హోటల్ చేరుకున్నాము. శివ ధనుర్భంగం జరిగి నపుడు, శివుని విల్లు లో ఒక భాగం 20 కి.మీ. దూరం లో పడిందిట (ధనుష్కోడి). అక్కడ ధర్నాల మూలంగా “ఆటో” వంటి సాధనాలు దొరకక వెళ్ల లేక పోయాము. శ్రీ రాముల వారి అనుగ్రహం లేదు. మధ్యాహ్నం భోజనం చేసి  రిక్షాలలో 3 గం.లకు జనక్ పూర్ విమానాశ్ర యానికి చేరి, బుద్ధా ఎయిర్ వేస్  విమానం లో  ఖాట్మండు సాయంత్రం 6 గం. లకు చేరుకుని మా గోకర్ణ గెస్ట్ హౌస్ లో విశ్ర మించేము.
యాత్ర 20 వ రోజు: 06 – 09 – 2015.(ఆఖరి రోజు).
              ఉదయం 6 గం.లకు లేచి స్నానాదులు ముగించుకుని, పశుపతి నాధునికి అభిషేకం చేయించు కొని , లక్ష వత్తులు వెలిగించు కోవదానికి 7 గంటలకు పశుపతి నాథ్ ఆలయానికి బయలుదేరి వెళ్లాము. దారిలో గోకర్ణేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ఒక అమ్మ వారి శక్తి పీఠం (అమ్మ వారి మూత్ర సంచి అక్కడ పడిందట). చూసుకొని, పశుపతినాథ్ ఆలయం చేరుకొని స్వామికి చక్కగా అభిషేకం చేయించుకుని , లక్ష వత్తుల నెయ్యి దీపాలను వెలిగించు కుని 11.30 ని.లకు హోటల్ చేరుకుని ఒక గంట విశ్రాంతి తీసుకుని, భోజనం చేసి 1.30 ని.లకు ఖాట్మండు విమానాశ్రయానికి బయలుదేరాము. మా డిల్లీ విమానం సాయంత్రం 4 గం.లకి. 2 గం. లకు సెక్యూరిటీ చెక్ అవగానే బొర్డింగ్ పాస్ తీసుకుని 4 గం. లకు  బయలుదేరి 5.15ని.లకు డిల్లీ చేరాము. డిల్లీ నుండి 8.25 ని.లకు బయలు దేరి 10.30 ని.లకు హైదరాబాద్ చేరుకున్నాము. లగేజ్ తీసుకుని మిత్రులందరికి వీడుకోలు చెప్పి రాత్రి 12 గం. లకు ఇల్లు చేరుకొన్నాము. మా కైలాస మానస సరోవర యాత్ర అంతా ఒక కలలాగ అనిపించింది. మేమే ఈ యాత్ర చేయగలిసామా అనిపించింది. అంత కస్టమైన యాత్ర పరమేశ్వరుని కృప తో , గురూజీ  పట్టుదల, చక్కని ప్రణాళిక తో  ఈ యాత్ర చేయగలిసేము. ఒక హిందువు గా పుట్టిన వాడికి ఇంతకన్నా కావాల్సినది ఏముంటుంది?. బ్రతికినంతకాలం మా కైలాస మానస సరోవర, నేపాల్ ముక్తినాథ్ యాత్ర మా మనసులలో కదలాడుతూ వుంటుంది.
                                                       ***  హర హర మహాదేవ శంభో శంకర ***



       



                        మా శ్రీ లంక రామాయణ యాత్ర
                మమ్మల్ని మానస సరోవర్ యాత్ర కి తీసుకెళ్లిన శ్రీ నివాస్ గురుజీ ఒకనాడు ఫోన్ చేసిడాక్టర్ గారూ! శ్రీలంక రామాయణ యాత్రకి వస్తారా?” అని అడిగేరు. అంత వరకు భారత దేశం లో రామాయణం లో వర్ణించిన చాలా స్థలాలు గత ఐదు సంవత్సరాలలో చూడ గలిగాము ( అయోధ్య,  జనకపురి (మిదిల), మానస సరోవరం, నైమిశారణ్యం, చిత్రకూటం, కాశీ, గంగానది, ప్రయాగ, భరద్వాజ ఆశ్రమం,  నాసికాత్రయంబకం, పంచవటి, దండకారణ్యం, గోదావరి, పర్ణశాల, కిష్కింధ, ఋష్యమూక గిరి, పంపానది, అంజనాద్రి, మహేంద్ర గిరి, రామేశ్వరం, ధనుష్కోటి, సేతువు  మొదలయినవి ) .
                గురుజీ శ్రీలంక రామాయణ యాత్ర అనగానే,  శ్రీలంకలో జరిగిన రామాయణ ఘట్టాల స్థలాలు కూడా చూసే అవకాశం శ్రీరామచంద్రుడే కల్పించాడని తలచి వెంటనే మేమూ వస్తామని సంతోషం గా చెప్పాను.
                శ్రీ  యెమ్. యెస్. రామా రావు ట్రస్ట్   ఆధ్వర్యం లో  శ్రీ పోలాప్రగడ  శ్రీనివాస్ గురూజీ నాయకత్వం లో మా శ్రీలంక రామాయణ యాత్ర 2016 మార్చ్ నెల పందొమ్మిదవ తేదీన మొదలయింది .
మొదటి రోజు: ( 19 03 - 16)
             హైదరాబాద్ లో ఉదయం  5.35 ని కి విమానంలో బయలు దేరి మదరాసు మీదుగా శ్రీలంక లో కొలంబో విమానాశ్రయం  ఉదయం 10.50 ని. కు చేరుకున్నాము. కొలంబోలో భోజనం చేసి చిలావ్ బీచ్ రిసార్ట్ కి బయలుదేరాము. దారిలోమదంపేఅనే ఊరులో మురుగన్ దేవాలయం దర్శించుకున్నాము . తరువాత మున్నేశ్వరం అనే ఊరులో "మున్నేశ్వరుని" దర్శించుకున్నాము. అక్కడికి రెండు మైళ్ళ దూరంలో  మనవరి శివాలయాన్ని (రామలింగేస్వరుడు) చూసేము. ఇది సైకత(మనవరి) లింగం. శ్రీ రామచంద్రుడు  రావణ వధానంతరం బ్రహ్మహత్యా దోష నివారణార్ధం మొదట ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్టించాడ ని ఇక్కడ చెపుతారు. తరువాత రామేశ్వరం లో ప్రతిష్టించాడట. సాయంత్రం  ఐదు గంటలకు చిలావ్ బీచ్ రెసార్ట్ చేరి రాత్రి అచ్చట విశ్రమించాము. 
రెండవ రోజు:  (20 03 - 16)
             ఉదయం 8 గంటలకు ట్రింకోమలి కి బయలు దేరాము. దారిలో  రావణుడు కైకసి తర్పణాల కోసం నీరు దొరకకపోతే శూలంతో గుచ్చి చేసిన 7 వేడి నీటి బావులుచూశాము.అక్కడ నుండి  సముద్రపు అంచులో చిన్న కొండపై ఉన్నకోనేశ్వర్ శివాలయందర్శించుకొన్నాము. ఇక్కడ శివుని పేరు  “కోనేశ్వరుడు”. అమ్మ వారి పేరుమాధురి అమ్మన్”. ఈమెనే భారత దేశంలోశాంకరి మాతఅని పిలుస్తారు . ఆష్టా దశ శక్తి పీఠాలలో మొదటిది. అక్కడ అమ్మవారికి అందరం పూజలు చేయించుకొని చీరలు సమర్పించుకొని సాయంత్రం ఏడు గంటలకు ట్రింకోమలీ  సముద్ర తీరాన గల రిసార్ట్ లో  రాత్రికి విశ్రమించాము.

మూడవ రోజు : (21 -03 16)
             మూడవ రోజు ఉదయం 8 గంటలకు జాఫ్నా వైపు బయలుదేరాము. అక్కడ చాలా ద్వీపములు ఉన్నాయి. అందులో నాగ ద్వీపమొకటి. అక్కడ నాగదేవతసురసకు పెద్ద గుడి కట్టారు. ఆంజనేయ స్వామి సముద్రమును లంఘిచు సమయాన దేవతలు  స్వామి శక్తిని పరీక్షించ మని నాగమాత సురసా దేవిని కోరగా,  సురసా దేవి యోజన ప్రమాణాన నోరు తెరిచి స్వామి దారి కి అడ్డు నిలిచినిను మింగెదననితెలుప స్వామి సూక్ష్మ రూపాన ఆమె నోట దూరి బయటకు రాగా ఆమె మెచ్చు కొని ఆశీర్వదించి సీతాన్వేషణకు తరల మనుచు పంపినది. ఆంజనేయ స్వామికి సురసా దేవి అడ్డు గా నిలచినది యీ స్థలమని ఇక్కడ ఆమెకు గుడి కట్టారు . రాత్రికి జాఫ్నా లోని నల్లూర్ అనే ప్రాంతం లో విడిది చేశాము.
నాల్గవ రోజు : (22 03 16)
               నాల్గవ రోజు ఉదయం 8 గంటలకు నల్లూరులో   నల్లూర్ కందస్వామిఅని పిలువబడేమురుగన్ఆలయానికి వెళ్ళేము. గుడి చాలా పెద్ద ఆవరణలో ఉంది . చాలా అందంగా ఉందిసుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చాలా చిన్నది.  అక్కడనుండి "ఫత్తుని  అమ్మన్" అనే అమ్మవారి గుడిని నల్లూరు లో దర్శించుకొని "దంబుల్లా" అనే ప్రాంతానికి తరలి వెళ్లాము. అక్కడ ప్రపంచం లోనే అతి పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది. దాని ఎత్తు 100 అడుగులు. బంగారు ఛాయలో ఉంటుందిఅక్కడనే కొండ మీద 2000 సం.నాటి బౌద్ధ గుహలు 5 ఉన్నాయి. వాటిలో చాలా బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. రాత్రికి దంబుల్లా లోనే బస చేశాము.
దవరోజు : (23 - 03 - 16)
               ఉదయమే 8 గంటలకు "కాండీ" అనే ప్రాంతానికి బయలు దేరాము. దారిలో "మసాలా దినుసులతోట (స్పైస్ గార్డెన్) ను చూసుకొని అక్కడ నుండి కాండీ కి బయలు దేరాము. కాండీ అనే ప్రదేశములో  "నీలి రాళ్ళు" (బ్లూ సఫ్ఫైర్గనులు ఉన్నాయి. అక్కడ ఉన్న పెద్ద నీలి రాళ్ళ వర్తక కేంద్రాలను చూసాము. చాలా రకాల నీలి రాళ్ళు , తెల్ల రాళ్లు మొదలగు రాళ్ళతో చేసిన ఆభరణాలు కన్నులకు విందు చేశాయి. సింహళ ద్వీపం లోనే అతి పెద్ద బౌద్ధ ఆరామం కాండీ లో ఉంది. బుద్ధుని శరీర భాగాలలోని "పన్ను" ని అచ్చట ఉంచారటభారత్ లోని కళింగ దేశం నుండి హేమమాల అనే రాకుమారి 314 డి .లో బుద్ధుని పన్నుని అక్కడకు తెచ్చిందని అక్కడ వారు చెప్పారు ఆరామం లో బుద్ధుని బంగారు విగ్రహం ఉంది. చాలా బాగుంది. ఎంతో మంది విదేశీయులు అక్కడ కనిపించారు రాత్రికి అక్కడే బస చేశాము.
ఆరవ రోజు: (24 -03 - 16)
                 ఆరవ రోజు ఉదయమే బయలు దేరి "రంబోడా" అనే ప్రాంతం చేరాము. ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని వెదక డా నికి లంకలో మొదట గా కాలుమోపిన స్థలమది అని అక్కడ చెబుతారుఅక్కడ శ్రీ చిన్మయ మిషన్ వారు హనుమంతుని గుడి కట్టి 16 అడుగుల స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు (2001 లో). మేము అక్కడకు చేరిన రోజు ఆంజనేయస్వామికి విశేష మైన పూజలు చేస్తున్నారు. రోజునే హనుమ సీతా మాతకు రాముల వారిచ్చిన "ఉంగరం" యిచ్చారని అందుకే విశేష పూజలని చెపితే మా ఆనందానికి అంతు లేదు. అంతా శ్రీ రాముల వారి అనుగ్రహంఅక్కడే ఉన్న కాంటీన్ లో చక్కని భోజనం చేసి "నువార ఇలియ" (సీతా ఇలియా అని కూడా అంటారు) అనే ప్రాంతానికి బయలు దేరాము. రంబోడా , నువార ఇలియా ప్రాంతమంతాఅశోకవనంఅని పిలుస్తారు. శింశుపా వృక్షం క్రింద ఒక  సంవత్సరం కాలం సీతమ్మ నుంచిన స్థలం చేరాము. అక్కడ సీతమ్మ వారికి రామ, లక్ష్మణ హనుమ సమేతంగా గుడి కట్టారు. గుడి వెనుకే చక్కని సెలయేరు పారుతోంది .సీతమ్మవారు రోజూదానిలో  స్నానంచేసేవారట.  అక్కడే ఆంజనేయస్వామి పెద్దవి, చిన్నవి   పాద ముద్రలు ఉన్నాయి. ప్రాంత మంతా చాలా చల్లగా ఉందిఅంత వరకు మేము తిరిగిన ప్రదేశ మంతా చాలా వేడిగా ఉంది. సింహళం లో అతి ఎత్తైన ప్రదేశం అది అని గైడ్ చెప్పాడు. గుడిలో శ్రీ యెమ్. యెస్. రామారావు గారి మనుమడు, హనుమదుపాసకులు గురుజీ శ్రీ పోలాప్రగడ శ్రీనివాస్ గారు "సుందర కాండ" లోని కొన్ని భాగాలు మృదు మధురంగా పాడగా విని మేమంతా తన్మయుల మయ్యాము. గుడిలో మేము, చాలా మంది మా గ్రూపులో వాళ్ళు అమ్మవారికి చీరలు సమర్పించి పూజలు చేయించు కున్నాముఅక్కడ నుండి దగ్గరలో గల "గాయత్రి" అమ్మ వారి గుడికి వెళ్లాము. పెద్ద ఆవరణలో గుడి ప్రశాంతంగా చాలా బాగుంది. స్థలంలోనే ఇంద్రజిత్తు పరమశివుని కై తపమొనరించాడని  చెప్పారు.
               అక్కడ నుండి బయలుదేరి దగ్గరలోనే గల సీతమ్మవారు "అగ్ని ప్రవేశం" చేసిన ప్రదేశం చేరు కొన్నాము. సీతమ్మ వారి అగ్ని ప్రవేశం తలుచు కో గానే చాలా బాధనిపించిందిఅక్కడే ఒకే చెట్టు బోదె లో చెక్కిన గుండెలు చీల్చి సీతా రాములను చూపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది. అశోకవనం లో సీతమ్మ వారి గుడి, అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన స్థలం చూసి మనసంతా తెలియని బాధ తో రాత్రికి "నువార ఇలియ" లో బస చేశాము. అక్కడ రాత్రి చాలా చలి గా ఉంది. అక్కడ హోటల్ లో పంఖా కానీ, సి కానీ లేదు. అంటే అక్కడ ఎప్పుడు చాలా చల్లగా ఉంటుందన్న మాట. అంత చలి లో సీతమ్మ వారు  ఎలా వున్నారో  తలుచు కుంటె ఎంతో బాధనిపించింది . శ్రీ లంక లో ఆరోజు మాకు ఆఖరు రాత్రి. అంటే మా యాత్ర ముగింపు కొచ్చిందన్నమాట.
ఏడవ రోజు :(25 -03 - 16)
               రామాయణ ఘట్టాలను చూసి శ్రీలంక నుండి తిరుగు ప్రయాణం అయే రోజు. ఉదయం 5 గంటలకే బయలుదేరి  10.50 ని కు కొలంబో విమానాశ్రయం చేరుకొన్నాము. అక్కడనుండి మదరాసు మీదుగా హైదరాబాద్ రాత్రి 8. 10 ని కి చేరుకొని ఇల్లు చేరు కొనేసరికి రాత్రి 9.45 ని అయింది.
              మా గ్రూపులో మొత్తం 31 మందిమి ఉన్నాము. దానిలో ముగ్గురు లండన్ నుండి వచ్చి మాతో "కొలంబో" లో కలిసేరు. అందరం ప్రయాణంలో భక్తి పాటలతో, భజనలతో, జోకులతో సరదాగా ఒక కు టుంబంలా ఆనందంగా గడిపాము. గురుజీ రోజూ ఉదయమే శివునకు, హనుమకు అభిషేకం చేసేవారు. అందరం అందులో పాల్గొనే వాళ్ళంలండన్ నుండి వచ్చిన మూర్తి గారు, వారి సతీమణి శారద గారు, రమేష్ గారు తిరిగి కొలంబోలో మాతో విడివడి లండన్ తిరిగి వెళ్ళిపోయారు. యాత్ర కొచ్చిన అందరూ ఎంతో ఆధ్యాత్మిక చింతన గలవారే. మా గ్రూపులో నలుగురు తప్ప అందరూ గురూజీతో మానస సరోవర్ యాత్రకు వచ్చినవారే.


              మా శ్రీలంక రామాయణ యాత్ర అంతా ఒక కలలా అనిపించింది . జన్మలోనో చేసుకున్న పుణ్యం వలన వెళ్లగలిగాము                        అంతా శ్రీ రాముల వారి కృప. ఇంత మంచి యాత్ర మాచే చేయించిన గురుజీ శ్రీనివాస్ గారికి సుమాంజలులు.
                                    జై శ్రీరామ్.    జై శ్రీరామ్జై శ్రీరామ్.                                   


 munneswaralayam


 Manavari(సైకత) Siva temple


 Koneswar/శాంకరిశక్తిపీఠం


Sankari matha temple


Morning Abhishekam


Abhishekam


On the way to Nagadweep(Surasa temple)


Surasa Devi temple


Surasa Devi Temple


Nallur Murugan Temple


Dambulla


Morning Abhishekam


Ramboda Hanuman Temple


Ramboda Hanuman


In Asokavanam








              


About the Blog

 
Welcome to this blog of the descendants of Sri Mahabhashyam Narasimham of Vizianagaram .
Our ancestors hail from Gazulapalle , Kurnool District. They were Sanskrit scholars . One of them , Seshadri Sastri went to Benares to prosecute his higher studies. On his return journey , the then Maharajah of Vizianagaram detained him in Vizianagaram and appointed him as the Asthana Pandit.His erudition was so great , particularly his commentary on Sankara's works , that he was conferred the title "Mahabhashyam" which subsequently became the surname of the family . Our original surname was "Rudraksha"
QRCode

post slideshow

Loading...