మా శ్రీ లంక రామాయణ యాత్ర
మమ్మల్ని మానస సరోవర్ యాత్ర కి తీసుకెళ్లిన శ్రీ నివాస్ గురుజీ ఒకనాడు ఫోన్ చేసి “డాక్టర్ గారూ! శ్రీలంక రామాయణ యాత్రకి వస్తారా?” అని అడిగేరు. అంత వరకు భారత దేశం లో రామాయణం లో వర్ణించిన చాలా స్థలాలు గత ఐదు సంవత్సరాలలో చూడ గలిగాము ( అయోధ్య, జనకపురి (మిదిల), మానస సరోవరం, నైమిశారణ్యం, చిత్రకూటం, కాశీ, గంగానది, ప్రయాగ, భరద్వాజ ఆశ్రమం, నాసికాత్రయంబకం, పంచవటి, దండకారణ్యం, గోదావరి, పర్ణశాల, కిష్కింధ, ఋష్యమూక గిరి, పంపానది, అంజనాద్రి, మహేంద్ర గిరి, రామేశ్వరం, ధనుష్కోటి, సేతువు మొదలయినవి ) .
గురుజీ శ్రీలంక రామాయణ యాత్ర అనగానే, శ్రీలంకలో జరిగిన రామాయణ ఘట్టాల స్థలాలు కూడా చూసే అవకాశం శ్రీరామచంద్రుడే కల్పించాడని తలచి వెంటనే మేమూ వస్తామని సంతోషం గా చెప్పాను.
శ్రీ యెమ్. యెస్. రామా రావు ట్రస్ట్ ఆధ్వర్యం లో శ్రీ పోలాప్రగడ శ్రీనివాస్ గురూజీ నాయకత్వం లో మా శ్రీలంక రామాయణ యాత్ర 2016
మార్చ్ నెల పందొమ్మిదవ తేదీన మొదలయింది .
మొదటి రోజు: ( 19 – 03 - 16)
హైదరాబాద్ లో ఉదయం 5.35 ని కి విమానంలో బయలు దేరి మదరాసు మీదుగా శ్రీలంక లో కొలంబో విమానాశ్రయం ఉదయం 10.50 ని. కు చేరుకున్నాము. కొలంబోలో భోజనం చేసి చిలావ్ బీచ్ రిసార్ట్ కి బయలుదేరాము. దారిలో “మదంపే” అనే ఊరులో మురుగన్ దేవాలయం దర్శించుకున్నాము . ఆ తరువాత మున్నేశ్వరం అనే ఊరులో "మున్నేశ్వరుని" దర్శించుకున్నాము. అక్కడికి రెండు మైళ్ళ దూరంలో మనవరి శివాలయాన్ని (రామలింగేస్వరుడు) చూసేము. ఇది సైకత(మనవరి) లింగం. శ్రీ రామచంద్రుడు రావణ వధానంతరం బ్రహ్మహత్యా దోష నివారణార్ధం మొదట ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్టించాడ ని ఇక్కడ చెపుతారు. తరువాత రామేశ్వరం లో ప్రతిష్టించాడట. సాయంత్రం ఐదు గంటలకు చిలావ్ బీచ్ రెసార్ట్ చేరి రాత్రి అచ్చట విశ్రమించాము.
రెండవ రోజు: (20 – 03 -
16)
ఉదయం 8 గంటలకు ట్రింకోమలి కి బయలు దేరాము. దారిలో రావణుడు కైకసి తర్పణాల కోసం నీరు దొరకకపోతే శూలంతో గుచ్చి చేసిన 7 వేడి నీటి బావులుచూశాము.అక్కడ నుండి సముద్రపు అంచులో చిన్న కొండపై ఉన్న “కోనేశ్వర్ శివాలయం” దర్శించుకొన్నాము. ఇక్కడ శివుని పేరు “కోనేశ్వరుడు”. అమ్మ వారి పేరు “మాధురి అమ్మన్”. ఈమెనే భారత దేశంలో “శాంకరి మాత” అని పిలుస్తారు . ఆష్టా దశ శక్తి పీఠాలలో మొదటిది. అక్కడ అమ్మవారికి అందరం పూజలు చేయించుకొని చీరలు సమర్పించుకొని సాయంత్రం ఏడు గంటలకు ట్రింకోమలీ సముద్ర తీరాన గల రిసార్ట్ లో ఆ రాత్రికి విశ్రమించాము.
మూడవ రోజు :
(21 -03 – 16)
మూడవ రోజు ఉదయం 8 గంటలకు జాఫ్నా వైపు బయలుదేరాము. అక్కడ చాలా ద్వీపములు ఉన్నాయి. అందులో నాగ ద్వీపమొకటి. అక్కడ నాగదేవత “సురస” కు పెద్ద గుడి కట్టారు. ఆంజనేయ స్వామి సముద్రమును లంఘిచు సమయాన దేవతలు స్వామి శక్తిని పరీక్షించ మని నాగమాత సురసా దేవిని కోరగా, సురసా దేవి యోజన ప్రమాణాన నోరు తెరిచి స్వామి దారి కి అడ్డు నిలిచి “నిను మింగెదనని” తెలుప స్వామి సూక్ష్మ రూపాన ఆమె నోట దూరి బయటకు రాగా ఆమె మెచ్చు కొని ఆశీర్వదించి సీతాన్వేషణకు తరల మనుచు పంపినది. ఆంజనేయ స్వామికి సురసా దేవి అడ్డు గా నిలచినది యీ స్థలమని ఇక్కడ ఆమెకు గుడి కట్టారు . ఆ రాత్రికి జాఫ్నా లోని నల్లూర్ అనే ప్రాంతం లో విడిది చేశాము.
నాల్గవ రోజు :
(22 – 03 – 16)
నాల్గవ రోజు ఉదయం 8 గంటలకు నల్లూరులో “నల్లూర్ కందస్వామి” అని పిలువబడే “మురుగన్” ఆలయానికి వెళ్ళేము. ఆ గుడి చాలా పెద్ద ఆవరణలో ఉంది . చాలా అందంగా ఉంది. సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చాలా చిన్నది. అక్కడనుండి "ఫత్తుని అమ్మన్"
అనే అమ్మవారి గుడిని నల్లూరు లో దర్శించుకొని
"దంబుల్లా"
అనే ప్రాంతానికి తరలి వెళ్లాము. అక్కడ ప్రపంచం లోనే అతి పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది. దాని ఎత్తు 100 అడుగులు. బంగారు ఛాయలో ఉంటుంది. అక్కడనే కొండ మీద 2000 సం.నాటి బౌద్ధ గుహలు 5 ఉన్నాయి. వాటిలో చాలా బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఆ రాత్రికి దంబుల్లా లోనే బస చేశాము.
ఐ దవరోజు :
(23 - 03 - 16)
ఉదయమే 8 గంటలకు
"కాండీ"
అనే ప్రాంతానికి బయలు దేరాము. దారిలో
"మసాలా దినుసుల
" తోట (స్పైస్ గార్డెన్) ను చూసుకొని అక్కడ నుండి కాండీ కి బయలు దేరాము. కాండీ అనే ప్రదేశములో "నీలి రాళ్ళు"
(బ్లూ సఫ్ఫైర్
) గనులు ఉన్నాయి. అక్కడ ఉన్న పెద్ద నీలి రాళ్ళ వర్తక కేంద్రాలను చూసాము. చాలా రకాల నీలి రాళ్ళు , తెల్ల రాళ్లు మొదలగు రాళ్ళతో చేసిన ఆభరణాలు కన్నులకు విందు చేశాయి. సింహళ ద్వీపం లోనే అతి పెద్ద బౌద్ధ ఆరామం కాండీ లో ఉంది. బుద్ధుని శరీర భాగాలలోని
"పన్ను"
ని అచ్చట ఉంచారట. భారత్ లోని కళింగ దేశం నుండి హేమమాల అనే రాకుమారి 314 ఏ డి .లో బుద్ధుని పన్నుని అక్కడకు తెచ్చిందని అక్కడ వారు చెప్పారు. ఆ ఆరామం లో బుద్ధుని బంగారు విగ్రహం ఉంది. చాలా బాగుంది. ఎంతో మంది విదేశీయులు అక్కడ కనిపించారు. ఆ రాత్రికి అక్కడే బస చేశాము.
ఆరవ రోజు: (24
-03 - 16)
ఆరవ రోజు ఉదయమే బయలు దేరి "రంబోడా"
అనే ప్రాంతం చేరాము. ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని వెదక డా నికి లంకలో మొదట గా కాలుమోపిన స్థలమది అని అక్కడ చెబుతారు. అక్కడ శ్రీ చిన్మయ మిషన్ వారు హనుమంతుని గుడి కట్టి 16 అడుగుల స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు
(2001 లో). మేము అక్కడకు చేరిన రోజు ఆంజనేయస్వామికి విశేష మైన పూజలు చేస్తున్నారు. ఆ రోజునే హనుమ సీతా మాతకు రాముల వారిచ్చిన
"ఉంగరం"
యిచ్చారని అందుకే ఆ విశేష పూజలని చెపితే మా ఆనందానికి అంతు లేదు. అంతా శ్రీ రాముల వారి అనుగ్రహం. అక్కడే ఉన్న కాంటీన్ లో చక్కని భోజనం చేసి "నువార ఇలియ" (సీతా ఇలియా అని కూడా అంటారు) అనే ప్రాంతానికి బయలు దేరాము. రంబోడా , నువార ఇలియా ప్రాంతమంతా “అశోకవనం” అని పిలుస్తారు. శింశుపా వృక్షం క్రింద ఒక సంవత్సరం కాలం సీతమ్మ నుంచిన స్థలం చేరాము. అక్కడ సీతమ్మ వారికి రామ, లక్ష్మణ హనుమ సమేతంగా గుడి కట్టారు. ఆ గుడి వెనుకే చక్కని సెలయేరు పారుతోంది .సీతమ్మవారు రోజూదానిలో స్నానంచేసేవారట. అక్కడే ఆంజనేయస్వామి పెద్దవి, చిన్నవి పాద ముద్రలు ఉన్నాయి. ఆ ప్రాంత మంతా చాలా చల్లగా ఉంది . అంత వరకు మేము తిరిగిన ప్రదేశ మంతా చాలా వేడిగా ఉంది. సింహళం లో అతి ఎత్తైన ప్రదేశం అది అని గైడ్ చెప్పాడు. ఆ గుడిలో శ్రీ యెమ్. యెస్. రామారావు గారి మనుమడు, హనుమదుపాసకులు గురుజీ శ్రీ పోలాప్రగడ శ్రీనివాస్ గారు "సుందర కాండ" లోని కొన్ని భాగాలు మృదు మధురంగా పాడగా విని మేమంతా తన్మయుల మయ్యాము. ఆ గుడిలో మేము, చాలా మంది మా గ్రూపులో వాళ్ళు అమ్మవారికి చీరలు సమర్పించి పూజలు చేయించు కున్నాము . అక్కడ నుండి దగ్గరలో గల "గాయత్రి"
అమ్మ వారి గుడికి వెళ్లాము. పెద్ద ఆవరణలో గుడి ప్రశాంతంగా చాలా బాగుంది. ఆ స్థలంలోనే ఇంద్రజిత్తు పరమశివుని కై తపమొనరించాడని చెప్పారు.
అక్కడ నుండి బయలుదేరి దగ్గరలోనే గల సీతమ్మవారు
"అగ్ని ప్రవేశం"
చేసిన ప్రదేశం చేరు కొన్నాము. సీతమ్మ వారి అగ్ని ప్రవేశం తలుచు కో గానే చాలా బాధనిపించింది
. అక్కడే ఒకే చెట్టు బోదె లో చెక్కిన గుండెలు చీల్చి సీతా రాములను చూపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది. అశోకవనం లో సీతమ్మ వారి గుడి, అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన స్థలం చూసి మనసంతా తెలియని బాధ తో ఆ రాత్రికి
"నువార ఇలియ" లో బస చేశాము. అక్కడ రాత్రి చాలా చలి గా ఉంది. అక్కడ హోటల్ లో పంఖా కానీ, ఏ సి కానీ లేదు. అంటే అక్కడ ఎప్పుడు చాలా చల్లగా ఉంటుందన్న మాట. అంత చలి లో సీతమ్మ వారు ఎలా వున్నారో తలుచు కుంటె ఎంతో బాధనిపించింది . శ్రీ లంక లో ఆరోజు మాకు ఆఖరు రాత్రి. అంటే మా యాత్ర ముగింపు కొచ్చిందన్నమాట.
ఏడవ రోజు :(25
-03 - 16)
రామాయణ ఘట్టాలను చూసి శ్రీలంక నుండి తిరుగు ప్రయాణం అయే రోజు. ఉదయం 5 గంటలకే బయలుదేరి 10.50 ని కు కొలంబో విమానాశ్రయం చేరుకొన్నాము. అక్కడనుండి మదరాసు మీదుగా హైదరాబాద్ రాత్రి 8.
10 ని కి చేరుకొని ఇల్లు చేరు కొనేసరికి రాత్రి 9.45
ని అయింది.
మా గ్రూపులో మొత్తం 31 మందిమి ఉన్నాము. దానిలో ముగ్గురు లండన్ నుండి వచ్చి మాతో "కొలంబో"
లో కలిసేరు. అందరం ప్రయాణంలో భక్తి పాటలతో, భజనలతో, జోకులతో సరదాగా ఒక కు టుంబంలా ఆనందంగా గడిపాము. గురుజీ రోజూ ఉదయమే శివునకు, హనుమకు అభిషేకం చేసేవారు. అందరం అందులో పాల్గొనే వాళ్ళం
. లండన్ నుండి వచ్చిన మూర్తి గారు, వారి సతీమణి శారద గారు, రమేష్ గారు తిరిగి కొలంబోలో మాతో విడివడి లండన్ తిరిగి వెళ్ళిపోయారు. యాత్ర కొచ్చిన అందరూ ఎంతో ఆధ్యాత్మిక చింతన గలవారే. మా గ్రూపులో నలుగురు తప్ప అందరూ గురూజీతో మానస సరోవర్ యాత్రకు వచ్చినవారే.
మా శ్రీలంక రామాయణ యాత్ర అంతా ఒక కలలా అనిపించింది . ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వలన వెళ్లగలిగాము అంతా ఆ శ్రీ రాముల వారి కృప. ఇంత మంచి యాత్ర మాచే చేయించిన గురుజీ శ్రీనివాస్ గారికి సుమాంజలులు.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
munneswaralayam
Manavari(సైకత) Siva temple
Koneswar/శాంకరిశక్తిపీఠం
Sankari matha temple
Morning Abhishekam
Abhishekam
On the way to Nagadweep(Surasa temple)
Surasa Devi temple
Surasa Devi Temple
Nallur Murugan Temple
Dambulla
Morning Abhishekam
Ramboda Hanuman Temple
Ramboda Hanuman
In Asokavanam
0 comments:
Post a Comment